గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): పోలీసు విభాగంలో కొత్తగా విధుల్లో చేరేవారు అంకిత భావంతో పనిచేసి డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న 1461 మంది ఏఆర్, సివిల్ స్టయిపెండియరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ (ఎస్‌సీటీపీసీ) సోమవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి సీపీ సజ్జనార్‌తోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కానిస్టేబుల్స్‌ను ఉద్దేశించి సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే తెలంగాణ పోలీస్ బ్రాండ్‌ను ఇనుమడింపజేయాలని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని విధులకు హాజరవుతున్న ప్రతి కానిస్టేబుల్‌కు పేరు పేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. కమిషనరేట్‌ను వదిలి కాలు బయటపెడితే మీరు సాధారణ వ్యక్తులు కారని, మొత్తం పోలీసు విభాగానికే ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అవుతారని అన్నారు. కనుక మీరు ఏం చేసినా డిపార్ట్‌మెంట్ పైనే ఆ ముద్ర పడుతుందన్నారు. విధుల్లో చేరే కానిస్టేబుల్స్ అంకితభావంతో సేవలు అందించాలని సూచించారు.
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీసు విభాగంలో మీ ప్రయాణం పూర్తిగా నేర్చుకునే అనుభూతిగా మారుతుందన్నారు. నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని, పోలీసు విభాగానికి మంచి పేరు తేవాలని అన్నారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రోహిని ప్రియదర్శిని మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ అంటే ఏకత్వానికి ప్రతీక అని అన్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఇతర అధికారులు, సిబ్బంది అంతా కలసి కట్టుగా పనిచేయాలని, అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో వుమెన్ అండ్ చైల్డ్ సెక్యూరిటీ వింగ్ డీసీపీ అనసూయ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, అడ్మిన్ ఏడీసీపీ లావణ్య ఎన్‌జేపీ, హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీ నారాయణ, సీటీసీ యూనిట్ డాక్టర్ సుకుమార్, ఇన్‌స్పెక్టర్లు, ఆర్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.