ఇంటి నంబ‌ర్లు కేటాయించాల‌ని నేతాజీ నగర్ వాసుల విన‌తి

గచ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ సోమ‌వారం ప్ర‌భుత్వం విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాల‌కు వినతి పత్రాల‌ను అంద‌జేశారు. ఈ సందర్భంగా భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ.. నల్లగండ్ల గ్రామం శివారు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 195 లోని నేతాజీ నగర్ కాలనీలో సుమారుగా 600 పైచిలుకు కుటుంబాలు 60 గజాల స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకుని 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయ‌ని తెలిపారు. నేతాజీ నగర్ కాలనీలో నివసిస్తున్న ప్రజలు విద్యుత్, నీటి బిల్లుల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తున్నార‌ని తెలిపారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న భేరి రాంచందర్ యాదవ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ 58 జీవోను జారీ చేశార‌ని, దీంతో స్థ‌లాల‌ను రెగ్యులరైజేషన్ చేసేందుకు అవకాశం క‌ల్పించార‌ని తెలిపారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నార‌ని, అప్లై చేసుకున్న వారిలో కూడా కొద్ది మందికి 58 జీవో ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింద‌ని తెలిపారు. ఇంకా 500 పైచిలుకు ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ 58 జీవో కింద‌ రెగ్యులరైజేషన్ కోసం కల్పించాలని కోరారు. అలాగే జీహెచ్ఎంసీ ఇంటి నంబర్లు కేటాయించాల‌ని, ట్యాక్స్ చెల్లించే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేష‌న్‌ ఉపాధ్యక్షులు రాయుడు, బాల్ రాజ్ నాయక్, కార్యదర్శి నరేందర్, రజక సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, రాంబాబు నాయక్, రమేష్ గుప్తా, గణేష్ బాబు, రాజు, నాగరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబాకు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న భేరి రాంచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here