శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో విధులు నిర్వహించిన అంగన్ వాడీలకు ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అలవెన్స్‌లను చెల్లించలేదని, వెంటనే చెల్లింపులు చేయాలని కోరుతూ సీఐటీయూ శేరిలింగంపల్లి నాయకుల ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ, శేరిలింగంపల్లి అంగన్ వాడీ టీచర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత నవంబర్ నెలలో నిర్వహించిన కుల గణన సర్వేలో తాము విధులు నిర్వహించామని తెలిపారు. అందుకు గాను ప్రభుత్వం ఒక్కో అంగన్ వాడీకి రూ.10వేల చెల్లించేందుకు అంగీకరించిందని అన్నారు. కానీ ఇప్పటి వరకు సదరు అలవెన్స్‌లకు గాను చెల్లింపులు చేయలేదని, వెంటనే ఆ చెల్లింపులు పూర్తి చేయాలని వారు కోరారు.