శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని వాటర్ లాగింగ్ పాయింట్లు, మల్కం చెరువును జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఉప కమిషనర్, ఇంజనీరింగ్, హైడ్రా, సాగునీటి శాఖ అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. తనిఖీల సందర్భంగా డ్రైనేజీ ప్రవాహ మార్గాలు, వర్షపు నీటి పారుదల పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రానున్న వర్షాకాలంలో నీటి నిల్వలు, వాటర్ లాగింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు. వాటర్ లాగింగ్‌కు గురయ్యే ప్రాంతాల్లో తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ వరద ఉపశమన చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.






