శేరిలింగంపల్లి, జూన్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ కారణంగా తలెత్తుతున్న సమస్యలను స్థానిక నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీవాసుల వివరాల ప్రకారం ఓవర్‌హెడ్ ట్యాంక్ వద్దకు వచ్చే వాటర్ ట్యాంకర్లు అధిక వేగంతో, నిర్లక్ష్యంగా సంచరిస్తుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రహదారులపై సంచరించేందుకు భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ట్యాంకర్లలోని నీరు ఓవర్‌ఫ్లో అయి రోడ్లపై పడటంతో ఆ నీరు ఇళ్లలోకి చేరి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని తెలిపారు. నీటి లీకేజీ కారణంగా రహదారులు కూడా దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ సమస్యలపై కాలనీవాసులతో కలిసి స్పందించిన కట్ల శేఖర్ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులను కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సమస్యను అత్యవసరంగా పరిగణించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంకర్ల వేగ నియంత్రణ, నీటి లీకేజీ నివారణ, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వంటి చర్యలను వెంటనే చేపట్టాలని కాలనీవాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.






