శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు కుత్బుల్లాపూర్ జోన్, చింతల్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డి నగర్ వార్డులో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. సీఎంసీ కమిషనర్‌తోపాటు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక నివాసులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వార్డులో నెలకొన్న పౌర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, శ్మశానవాటిక అభివృద్ధి, వీధి దీపాలు, బస్ షెల్టర్లు, కమ్యూనిటీ సదుపాయాలు, పబ్లిక్ టాయిలెట్లు, ట్రాఫిక్ నిర్వహణ, ఆక్రమణలు తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యను నమోదు చేసి, విభాగాల వారీగా సమీక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట ఇతర లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయం చేసుకుని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల వద్దకే వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తూ వాటికి పరిష్కారం చూపేందుకు సీఎంసీ చర్యలు కొనసాగిస్తోంది.





