శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి పర్యటించారు. నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ రోడ్డు, ఖాజాగూడ, ట్రిపుల్ ఐటీ జంక్షన్, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రోడ్డు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఇచ్చిన సమయం వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానికులకు మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపినట్లు అవుతుందని అన్నారు.