శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ భవానీపురం వీకర్ సెక్షన్ కాలనీలో పేద ప్రజల ఇండ్లకు నంబర్లు కేటాయించాలని, చందానగర్ డివిజన్ పరిధిలో కొత్తగా బతుకమ్మ కుంటలను ఏర్పాటు చేయాలని చందానగర్ డిప్యూటీ కమిషనర్ కు చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చందానగర్ డివిజన్లోని భవానీపురం వీకర్ సెక్షన్ కాలనీలో నివసిస్తున్న నిరుపేదల ఇళ్లకు నంబర్లను కేటాయించాలని, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ కుంటలకు మరమ్మతులు చేపట్టాలని చందానగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశికళకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ భవానీపురం వీకర్ సెక్షన్ కాలనీలో దశాబ్దాలుగా సుమారు అరవై గజాల స్థలంలో పేద ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, వారి ఇళ్లకు నంబర్లు లేకపోవడంతో అనేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని తెలిపారు. తక్షణమే వారి ఇళ్లకు నంబర్లు కేటాయించాలని కోరారు. అదే విధంగా దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డివిజన్ పరిధిలోని బతుకమ్మ కుంటలకు వెంటనే మరమ్మతులు చేయించాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు. పలు కాలనీల్లో బతుకమ్మ కుంటలు లేవని, కొత్తగా బతుకమ్మ కుంటలు ఏర్పాటు చేయాలన్నారు.





