నేతాజీన‌గ‌ర్ వాసులు ధ‌ర‌ణిలో న‌మోదు చేసుకోవాలి: భేరి రామచందర్ యాదవ్

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ లో నివాసం ఉంటున్న ఇంటి య‌జ‌మానులు త‌మ ఇళ్ల వివ‌రాల‌ను ధ‌ర‌ణిలో న‌మోదు చేయించుకోవాల‌ని కాల‌నీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. బుధ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. నేతాజీ నగర్ కాలనీలో నల్లగండ్ల‌ శివారు భూమి సర్వే నంబర్ 195 లో 19 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో 625 ఫ్లాట్లు ఏర్ప‌డ్డాయ‌ని, 1992లో హుడా నిబంధ‌న‌ల‌ ప్రకారం లే ఔట్ చేసి ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం పొజిషన్ సర్టిఫికెట్ పట్టాల‌ను 625 మంది లబ్ధిదారులకు ఇచ్చింద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ స్థలాలు కట్టుకున్న నిరుపేదలకు వెసులుబాటు కలిగిస్తూ కలిగిస్తూ 58 జీవో రెగ్యులేషన్ కొంతమందికి పట్టాలు ఇచ్చార‌ని తెలిపారు.

కాల‌నీ వాసుల‌తో మాట్లాడుతున్న భేరి రామచందర్ యాదవ్

నేతాజీ నగర్ కాలనీలో చాలామందికి పట్టాలు రాలేద‌ని, వారందరికీ యాజమాన్య హక్కులు కల్పిస్తూ 58 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ చేస్తూ ఇంటి నంబ‌ర్లు, హౌస్ ట్యాక్స్ కల్పించాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాకి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింద‌ని అన్నారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందిస్తూ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకెళ్లార‌ని తెలిపారు. నూతనంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్‌సైట్ వ‌ల్ల స్థానికంగా ఉన్న ఇంటి యజమానులు తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఆధార్ కార్డు, ఇంటి యజమాని ఫోటో, ఆధారాలు చూపించి ధరణి పోర్ట‌ల్‌లో త‌మ ఇళ్ల వివ‌రాల‌ను న‌మోదు చేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

ధ‌ర‌ణిలో వివ‌రాలు న‌మోదు చేస్తున్న సిబ్బంది

జీహెచ్ఎంసీ సిబ్బంది ఇందుకు గాను సర్వే చేస్తున్నార‌ని, ఇంటింటికీ వచ్చి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నార‌ని తెలిపారు. క‌నుక నేతాజీన‌గ‌ర్ వాసులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది హరీష్ కుమార్ రెడ్డి, టాక్స్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్, శివ‌, వెంకటేష్, రమణ, కాలనీ అసోసియేష‌న్‌ ఉపాధ్యక్షులు ఎండీ కమర్ పాషా, టి కుమార్ ముదిరాజ్, రమేష్ గుప్తా, శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here