శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల కమ్యూనిటి హాల్ దగ్గర, బాపు నగర్, ఆనందనగర్ లలో సోమవారం మహిళలకు ముగ్గులు పోటీలను నిర్వహించారు. ప్రతి కాలనీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఐదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. జాగర్లమూడి జనార్దన రావు సౌజన్యంతో బహుమతులను ఇచ్చారు.
ఈ సందర్భంగా తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలే పండగలని అన్నారు. ముఖ్యంగా పట్టణీకరణ నేపథ్యంలో రోజు రోజుకు మన సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు అవుతున్న ఈ తరుణంలో భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. ఈ ముగ్గుల పోటీల వల్ల మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి అవకాశం ఏర్పడతుందన్నారు. నిత్యం ఇంటి ముందర ముగ్గులు వేయటం వలన పరిసరాల పరిశుభ్రతతోపాటు మహిళలకు సంబంధించిన అనేక ఉదరకోశ వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రజని, శివరామకృష్ణ, ఆర్గనైజర్స్ తన్వీర్ బేగం, నజీరా, వార్డు మెంబర్ వాణి, స్థానిక మహిళలు పాల్గొన్నారు.