శేరిలింగంపల్లి, జనవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, ప్రమాదాలు జరిగిన తరువాత బాధపడడం కన్నా అవి జరగకుండా ముందుగానే జాగ్రత్తలను పాటించాలని కొల్లూర్ ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.దాదాసాహెబ్ అన్నారు. మంగళవారం కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్స్ కాలనీలో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన రహదారి భద్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడిపిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. పెద్దలు పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదని, అలా ఇస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను అతక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు రహదారి భద్రతను పాటించాలని సూచించారు.






