శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించకుండా డ్రైవింగ్ చేయాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో Arrive- Alive కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని బుట్ట కన్వెన్షన్ సెంటర్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీపీ రితీ రాజ్, ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ హన్మంత రావు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ సీఐ శ్రీధర్ లతో కలిసి ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రత అవగహన, అమలు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. Arrive- Alive అంటే గమ్యస్థానానికి చేరుకోవడం లేదా జీవించి చేరుకోవడం అని అర్థమని, ఇది ప్రధానంగా రోడ్డు భద్రత (Road Safety) కోసం ఉపయోగించే నినాదమని అన్నారు. వేగం, మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగే మరణాలను తగ్గించి, వాహనదారులు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సమాజంలో ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా అధికారులు సూచనలు చేస్తున్నప్పటికి 1.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని గాంధీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన ప్రజలు వారి కుటుంబాలను రోడ్డుపై వదిలేసి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను చూస్తున్నప్పటికి ప్రజల్లో మార్పు రావడం లేదన్నారు. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయని, రోడ్లపై మైనర్లు సైతం వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సమాజంలో కుటుంబాల కోసం వాహనాలు నడుపుతున్న ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు బాధ్యత వహించి రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణ ప్రసాద్, సిఐ సురేష్, సిఐ శ్రీధర్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





