- తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్
ఉప్పల్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉప్పల్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లు కానందున ఎన్నో లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు, దరఖాస్తు చేయని వారు, రిజిస్ట్రేషన్ల కోసం వేచి చూస్తున్న ప్లాట్ల ఓనర్లు, డాక్యుమెంట్ రైటర్లు ధరణి వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల గత 3 నెలలుగా ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజోపయోగపనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎం.నరసయ్య, పగడాల రంగారావు, బొంగు వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.







