మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ వైద్యుల ఘ‌న‌త‌.. విజ‌య‌వంతంగా లింఫాంజియోమా శ‌స్త్ర చికిత్స‌..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం 25 సంవత్సరాలుగా పునరావృతమవుతున్న ఒక అరుదైన రైట్ నెక్ లింఫాంజియోమా కేసును విజయవంతంగా పూర్తి చేశారు. రోగికి చికిత్స చేసి రోగి జీవితానికి కొత్త ఊపిరి ఇచ్చారు.రోగి గతంలో 2010, 2015, 2025లో మూడు సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ వాపు మళ్లీ రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. గడ్డ పెరిగి మెడ కదలికలు కష్టమవడం, శ్వాసలో ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చాయి. లింఫాంజియోమా అనేది లింఫ్, రక్తనాళాల అసాధారణ పెరుగుదల వల్ల ఏర్పడే అరుదైన మాల్ఫార్మేషన్ అని వైద్యులు తెలిపారు. ఇది తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలాగే మెడలో కీలక నరాలు, అవయవాల సమీపంలో ఉండడం వలన శస్త్రచికిత్స చాలా క్లిష్టంగా ఉంటుంద‌న్నారు.

మెడలో కీలకమైన నరాలు, రక్తనాళాలు, అన్ననాళం (Esophagus), శ్వాసనాళం (Trachea) సమీపంలో లింఫాంజియోమా ఉండటం, గత శస్త్రచికిత్సల వల్ల ఏర్పడిన తీవ్రమైన మచ్చల కణజాలం (Scar Tissue) కారణంగా ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారింద‌న్నారు. రోగి పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన అనంతరం సీనియర్ వాస్క్యులర్ సర్జన్ డా.రాహుల్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డా. వెంకట్ పవన్ , అనస్తేషియాలజీ విభాగం డా. వేణుగోపాల్ నేతృత్వంలో బహుళ నిపుణుల బృందం 5 గంటలు పాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన రికన్‌స్ట్రక్టివ్ ఎక్సిషన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. లింఫాంజియోమా పరిమాణం 5 కేజీలు ఉన్నట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా డా. రాహుల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పునరావృత లింఫాంజియోమాలు సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడినవ‌ని, తీవ్రమైన రక్తస్రావం, నరాల గాయాలు, అంతర్గత అవయవాల గాయాల ప్రమాదం అధికంగా ఉన్నప్పటికీ, ఆధునిక ఇమేజింగ్, క‌చ్చితమైన ప్రణాళికతో తాము ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా అద్భుతమైన ఫలితాన్ని సాధించామ‌ని వివరించారు. డా. వెంకట్ పవన్ మాట్లాడుతూ మునుపటి ఆపరేషన్ల వల్ల ఏర్పడిన మచ్చల కారణంగా కణజాల పొరలను గుర్తించడం కష్టమైంద‌ని, ప్రధాన నరాలు, రక్తనాళాలు, శ్వాసనాళం దెబ్బతినకుండా అత్యంత క‌చ్చితత్వంతో (Surgical Precision) ప్రతి దశనూ పూర్తి చేయగలిగామ‌ని తెలిపారు. త‌మ‌ బృందం అద్భుతమైన సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైంద‌ని తెలిపారు.

రోగి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడ్డాన‌ని, హోమియోపతి, నూనె మసాజ్‌లు, స్థానిక చికిత్సలు అన్నీ ప్రయత్నించాన‌ని తెలిపారు. ఉపశమనం దొరకకపోగా సమయాన్ని, డబ్బును వృథా చేసుకున్నాన‌ని అన్నారు. తాను అందరికీ చెప్పదలిచింది ఒక్కటేన‌ని ఇలాంటి సమస్యలకి నిర్ధారణ లేని వైద్యం చేయించవ‌ద్ద‌ని, అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాల‌ని. సరైన చికిత్స పొందాల‌ని సూచించారు. కాగా శస్త్రచికిత్స అనంతరం రోగి చాలా వేగంగా కోలుకుని కేవలం మూడవ రోజుకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని, ప్రస్తుతం రోగికి మెడ కదలికలు పూర్తిగా సాధారణంగా ఉన్నాయ‌ని. ఎటువంటి నరాల బలహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు లేవ‌ని వైద్యులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here