- కొద్ది దూరం వెళ్లి ఆగిపోయిన వాహనాలు…
- బంక్ వద్ద బాదిత వాహనదారుల ఆందోళన…
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి చౌరస్తా వద్ద ఉన్న మల్లిఖార్జున హెచ్‌పి ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్‌లో నీరు కలిసిన కారణంగా తమ వాహనాలు పాడయ్యాయని కొందరు వాహనదారులు బంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఫిల్లింగ్ స్టేషన్‌లో పెట్రోలు పోయించుకున్న అనంతరం కొద్ది దూరం వెళ్లగానే పలు వాహనాలు ఆగిపోవడంతో సర్వీసింగ్ సెంటర్‌లో చూపించారు. ఐతే పెట్రోల్ లో నీళ్లు కలిసినట్లు మెకానిక్‌లు గుర్తించినట్లు బాదితులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బైకు, కార్ల పెట్రోల్ ట్యాంకుల నుండి తొలగించిన నీటితో బాదితులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాగా పెట్రోల్‌బంక్ సిబ్బంది తమ తప్పేమీ లేదని ఆయిల్ సంస్థల నుండి అప్పుడప్పుడు అదేవిధంగా వస్తుందని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయగా బాదితులు మండిపడ్డారు.
కారుకు రూ.10 వేలు… బైక్‌కు రూ.2 వేలు..?
చివరకు బాధితుల ఆందోళను మల్లికార్జున ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం దిగొచ్చింది. వివాదాన్ని బయటకు పొక్కనీయకుండా పెట్రోల్ స్టేషన్ యాజమాన్యం ప్రయత్నించింది. ఈక్రమంలోనే బాదిత వాహనదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఆగిపోయిన కార్లకు రూ.10వేలు, ద్విచక్ర వాహనాలకైతే రూ.2 వేల చొప్పున చెల్లించినట్టు సమాచారం. దీంతో వివాదం సద్దుమణిగింది.