అక్కవాళ్ల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన శ్రీరామ్ సంతు…
నమస్తే శేరిలింగంపల్లి: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు అదృశ్యం ఐన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ వేముకుంటకు చెందిన ఎం.రాజు, శ్రీరామ్ సంతు(23)లకు మూడు నెలల క్రితం వివాహం అయ్యింది. రాజు స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తుండగా శ్రీరామ్ సంతు గృహిణి. గత నెల 27న బయటకు వెళ్లిన భర్తకు ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీరామ్ సంతు ఫోన్ చేసి తన అక్కవాళ్ల ఇంటికి వెళుతున్నట్టు చెప్పింది. మద్యాహ్నం 3.30 గంటల వరకు భర్తతో ఫోన్‌లో టచ్‌లో ఉంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. 28 నాడు రాజు అత్తగారింటికి వెళ్లి చూడగా భార్య అక్కడ లేక పోగా ఆమె సర్టిఫికెట్లు సైతం కనిపించలేదు. దీంతో బంధువులు తెలిసిన వారివద్ద ఆరాతీసిన భార్య జాడ దొరకలేదు. ఐతే ఆమె స్నేహితురాలు కవిత దగ్గరకు వెళ్లి ఉంటుందని బావించిన రాజు ఆమెకు ఫోన్ చేయగా అక్కడకు రాలేదని సమాదానం ఇచ్చింది. ఐతే 2 వ తేది నుంచి కవిత ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వస్తుండటంతో రాజు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హాస్టల్‌లో ఉంటానని చెప్పి వెళ్లిన రాజహంస…
చందానగర్ పాపిరెడ్డి కాలనీ ఆరంభ్ టౌన్‌షిప్‌లో నివాసం ఉండే సతీష్, రాజహంస(33)లకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రాజు స్థానికంగా కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా రాజహంస గృహిణి. కాగా పెళ్లయిన నాటినుంచి వారిరువురి మధ్య అప్పుడప్పుడు చిన్నచిన్న తగాదాలు వచ్చేవి. ఈ క్రమంలోనే జనవరి 29 నాడు బయటకు వెళ్లిన భర్త సతీష్‌కు భార్య రాజహంస ఫోన్ చేసి తనను సరిగా చూసుకోవడం లేదని, అందుకే తను ఇళ్లి విడిచి వెళ్లిపోతున్నట్టు తెలిపింది. జేఎన్‌టీయూ వద్ద హాస్టల్‌లో ఉంటున్నట్టు తెలిపిన భార్యతో భర్త తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండే వాడు. కాగా మార్చి 24 నుంచి రాజ హంస ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. స్నేహితులు బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరాతీసినా రాజహంస జాడ తెలియక పోవడంతో చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
రోజులాగే పనికోసం వెళ్లి మరియమ్మ…
చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన ఆలకుంట లక్ష్మన్, మరియమ్మ(21)లకు వివాహం జరిగి ఐదేళ్లవుతుంది. వారికి ఒక కూతురు సంతానం. లక్ష్మన్ స్థానికంగా టెంట్ హౌజ్‌లో పనిచేస్తుంటాడు. మరియమ్మ ఇండ్లలో పనిచేస్తుంటుంది. రోజులాగే గురువారం ఉదయం 8 గంటలకు పనికోసం వెళ్లిన మరియమ్మ తిరిగి రాలేదు. ఆమె పనిచేసే మసీద్ బండలోని ఓ ఇంటికి వెళ్లి ఆరాతీయగా రూ.1 వేయ్యి తీసుకుని వెళ్లిందని యజమానులు తెలిపారు. తర్వాత స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఆరాతీసిన మరియమ్మ జాడ తెలియక పోవడంతో లక్ష్మన్ చందానగర్ పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు మహిళల అదృశ్యాలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి ఆచూకి తెలిసిన వారు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు.