నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ఎంఏనగర్‌లోని ఓంకార క్షేత్ర ప్రాంగణంలో నిర్మాణ కూల్చివేతలపై దేవస్థాన కమిటీ సభ్యులు శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఎంఏనగర్‌లోని గుట్టపై గత రెండున్నర దశాబ్ధాల క్రితం ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించికుని నిత్య పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ఒక మండపం కట్టుకుని వినాయక చవితి, దసర, ఉగాది, శ్రీరామ నవమి తదితర పండగుల వేళ అక్కడే ఉత్సవాలు నిర్వహిస్తు వస్తున్నామని అన్నారు. 2015 ఓంకార క్షేత్ర దేవస్థాన కమిటీని ఏర్పాటు చేసుకుని అదే ప్రాంగణంలో శివాలయం, రామాలయాలను నిర్మించుకున్నామని తెలిపారు. కాగా మూడేళ్ల క్రితం కూలిన వినాయక మండపం, దెబ్బతిన రామాలయాలను పునర్నిర్మించాలని దేవాలయ కమిటీ నిర్ణయం తీసుకుని, అందుకు ఉపక్రమించగా రెండు రోజుల క్రితం హెచ్ఎండీఏ అధికారులు సదరు నిర్మాణాలను కూల్చివేశారన్నారు. స్థానికంగా రాజకీయ దురుద్ధేశంతో కొందరు నేతలు అధికారులను తప్పుదోవ పట్టించారని, వాస్తవ పరిస్థితులను ఆరాతీసి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు జరుపుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతీ పత్రం అందజేసిన వారిలో ఓంకార క్షేత్ర దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి కన్నా శ్రీనివాస్, కమిటి ప్రతినిధులు మధుసూదన్, తుకారం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
