ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలి: AIFDS

శేరిలింగంప‌ల్లి, జూలై 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు. శుక్ర‌వారం నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. AIFDS, AISF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మదీనాగూడ నుంచి చందానగర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లె మురళి, గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమాలపై కేంద్ర ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోందని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటీష్ పాలనను తలపించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతపై నిర్బంధ చర్యలు చేపట్టడం ఖండనీయమన్నారు.

ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు, యువతపై లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగం చేయడం, దాడులకు పాల్పడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా AIFDS, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో AISF శేరిలింగంపల్లి మండల కార్యదర్శి తేజ, AIFDS జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు అరుణ్, గణేష్, దుర్గాప్రసాద్, గణేష్, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here