హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): అన్యాయానికి గురవుతున్న విద్యుత్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని, రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులకు చెల్లించే వేతనాలను విద్యుత్ కార్మికులకు కూడా చెల్లించాలని జై తెలంగాణ సేన వ్యవస్థాపకులు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రాగం సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. మింట్ కంపౌండ్ లోని ట్రాన్స్ కో జెన్ కో కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ – 327, తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ -2871 ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు మంగళవారం రాగం సతీష్ యాదవ్ మద్దతు పలికారు. రాష్ట్ర విద్యుత్ కార్మికుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య ధోరణిని రాగం సతీష్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యుత్ కార్మికుల సేవలు మరవలేనివన్నారు.

కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను ఫర్మినెంట్ చేస్తామని మాయమాటలు చెప్పుతూ కాలయాపన చేయడం సరికాదన్నారు. అన్ మాన్డ్ కార్మికులను ఆర్టిజన్ లుగా వెంటనే గుర్తించాలన్నారు. ఒకే సంస్థలో రెండురకాల రూల్స్‌ను వర్తింపజేసేలా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే ల వేతనాలు మాత్రం పెంచుకున్నారని, విద్యుత్ కార్మికుల వేతనాలు మాత్రం పెంచలేదని ఆయన ఎద్దేవా చేశారు. మన కొలువులు, మన హక్కుల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల కుటుంబం వారికి కొలువులు, వారి హక్కులుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. మన కొలువులు, మన హక్కుల సాధన కోసం జై తెలంగాణ సేనను స్థాపించామని, రాష్ట్రంలో ఎదురయ్యే అన్యాయాలను ప్రశ్నించే గొంతుకగా వస్తున్నామని సతీష్‌యాదవ్ పేర్కొన్నారు.