చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): కాపులకు ఏ చిన్న సమస్య వచ్చినా తన సమస్య గా భావించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని భవ్యశ్రీ రెసిడెన్సిలో శ్రీ కృష్ణ దేవాదాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని కాపు సంఘం నేతలు మిరియాల రాఘవ రావు, మల్లికార్జున్ లు పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. తనను తమ కుటుంబాలలో ఒకరిగా భావించాలని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాపులు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం రాష్ట్ర నాయకుడు మిరియాల రాఘవ రావు, టీఆర్ఎస్ నాయకులు రవీందర్ రావు, రవీందర్ రెడ్డి, మిరియాల ప్రీతమ్, శ్రీ కృష్ణ దేవాదాయ కాపు సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్, సభ్యులు విష్ణు, త్రినాథరావు, సుబ్బారావు, శ్రీహరి, నాగబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.






