చలో కలెక్టరేట్ కు తరలి వెళ్లిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు

  • అక్రిడేషన్లపై వెలువరించిన జీవో 252 ను రద్దు చేయాలని వినతి

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – IJU) ఆధ్వర్యంలో నిర్వహించిన చలో రంగారెడ్డి కలెక్టరేట్ కు శేరిలింగంపల్లి జర్నలిస్టులు శనివారం భారీ ఎత్తున తరలి వెళ్లారు. శనివారం ఉదయం శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సమావేశమైన జర్నలిస్టులు కొంగరకలాన్ లోని రంగారెడ్డి కలెక్టరేట్ కు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హాజరైన జర్నలిస్టులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విఠ‌ల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ లు మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రెడిటేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.252 లోపభూయిష్టంగా ఉందని వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల నడుమ చిచ్చు పెట్టే ప్రయత్నం మీడియా అకాడమీలో ఉన్న పెద్దలు చేస్తున్నారని ఈ ప్రయత్నాన్ని తెలంగాణ జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లో సహించమని తేల్చి చెప్పారు. అక్రిడేషన్ల కుదింపుతో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు కనీస గుర్తింపును కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.

తెలంగాణ జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి మరో పోరాటానికి TUWJ సిద్ధమన్నారు. లోపభూయిష్టమైన జీవో 252 ను తక్షణమే ఉపసంహరించుకొని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 239 ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మరో పోరాటానికి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here