శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యుడు గరికపాటి మోహన్ రావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో కలిసి యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, ఇది శరీరం, మనస్సు, ఆత్మలను ఏకం చేసే ఒక ప్రాచీన పద్ధతి అని అన్నారు. యోగా అనేక ప్రయోజనాలను స్మరించుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఉద్దేశించిన మంచి రోజు యోగా రోజని గరికపాటి తెలిపారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, శరీరాన్ని బలోపేతం చేస్తుంది, సౌలభ్యాన్ని పెంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి యోగా ఒక శక్తివంతమైన సాధనమని తెలియజేశారు. యోగాను కేవలం ఒక రోజుకు పరిమితం చేయకుండా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీవాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా, రాష్ట్ర, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెంట్ కార్పొరేటర్స్, మహిళా మోర్చా ,యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.