శేరిలింగంపల్లి, అక్టోబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): కానరీ ద స్కూల్, BML ముంజాల్ యూనివర్సిటీ విజ్ఞాన భాగస్వాములుగా సంయుక్తంగా నిర్వహించిన తొలి మానవతావాద రూపకల్పన శిఖరాగ్ర సమావేశంలో హైదరాబాద్ అధ్యాయాన్ని కానరీ ది స్కూల్ లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని 20 పాఠశాలలకు చెందిన విద్యార్ధిని, విద్యార్థులు హాజరయ్యారు. వివిధ పాఠశాలల విద్యార్ధులు మానవీయ రూపకల్పన సూత్రాలను ఉపయోగించి, వాస్తవిక ప్రపంచ సమస్యలకు తమ వినూత్న పరిష్కారాలను తమదైన శైలిలో సూచించారు.
ఎంతో ఉత్కంఠతతో ప్రాథమిక రౌండ్ తర్వాత చివరి పోటీకి ఎనిమిది పాఠశాలలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. జ్యూరీ సభ్యులు BML ముంజాల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సౌమ్యజిత్ భర్, ప్రొఫెసర్ అనూప్ ధార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తుది ప్రదర్శనలను విశ్లేషించి మొదటి మూడు విజేత జట్లను ఎంపిక చేశారు. వాటిలో కెనరీ ది స్కూల్ మియాపూర్, సెయింట్ మైఖేల్స్ స్కూల్ అల్వాల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ సికింద్రాబాద్ ఈ వరుసలో నిలిచాయి. గెలుపొందిన ప్రతి టీమ్‌కు రూ.20,000 నగదు బహుమతిని అందించారు.
మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి, చైర్ పర్సన్ డాక్టర్ శ్వేతారెడ్డి, ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా, సీనియర్ స్కూల్ హెడ్ డాక్టర్ ఇమ్మడి నవీన్ కుమార్, అడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం, పివైపి కో ఆర్డినేటర్ అపర్ణ, ఎపివైపి కో ఆర్డినేటర్ ముక్తా తదితరులు పాల్గొన్నారు.