శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్‌కు ఆనుకుని ఉన్న రాగులకుంట చెరువు పైభాగంలోని 101 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమిపై అక్రమంగా ఆరు అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోందని MCPI(U) సహాయ కార్యదర్శి పల్లె మురళి ఆరోపించారు. నకిలీ పత్రాల ఆధారంగా అనుమతులు పొందుతూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సంబంధిత భూమికి చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు లేవని, దీప్తి శ్రీ నగర్ ఆమోదిత లేఔట్‌లో ఆ స్థలం స్పష్టంగా ప్రభుత్వ భూమిగా నమోదైందని తెలిపారు. దీనికి సంబంధించిన లేఔట్ కాపీలను అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అనధికార నిర్మాణాలు చేపట్టడం వల్ల చెరువు పరిసరాలు, ప్రజా ఆస్తులు, ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై GHMC మియాపూర్ సర్కిల్ 48 డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, ACP టౌన్ ప్లానింగ్ రాణికి ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు. అలాగే శేరిలింగంపల్లి డిప్యూటీ తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని కలిసి సమస్యను వివరించినట్లు చెప్పారు. స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, నకిలీ పత్రాల వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియజేయగా, అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణ స్థల పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు వెంటనే అక్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని, అనధికార భవనాన్ని కూల్చివేసి ప్రభుత్వ భూమిని రక్షించాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పల్లె మురళి డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను HYDRAA కమిషనర్, రాజేంద్రనగర్ RDO, శేరిలింగంపల్లి MRO, శేరిలింగంపల్లి జోన్ కమిషనర్, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు కూడా పంపినట్లు తెలిపారు.





