శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి యువ నాయకుడు రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద రాజకీయ కక్ష సాధింపులను చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి మరో చిల్లర డ్రామాకు ప్రయత్నిస్తున్నాడని వెల్లడించారు. ఇది ప్రజలు గమనిస్తున్నారని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించిన రవీందర్ యాదవ్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

ఫార్ములా ఈ-రేస్ పూర్తి పారదర్శకతతో జరిగిందని చెప్పారు. దీనిపై కేసు పెట్టి కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉందని, రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై పోరాటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, కాంగ్రెస్ చేస్తున్న దారుణాలను అడ్డుకొని తీరుతామని రవీందర్ యాదవ్ వెల్లడించారు.





