అన్నమయ్యపురంలో వైకుంఠ వాసం భజే

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ వాసం భజే కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూర్తయింది. వైకుంఠ ఏకాదశి రోజున అన్నమయ్య సమేత శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు అందుబాటులో ఉంచారు. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 8:30 గంట‌ల‌ వరకు ద‌ర్శ‌నాలు అందుబాటులో ఉండగా ఈ సమయాల్లో వేల భక్తులు విశేషంగా తరలి వచ్చారు. డిసెంబరు 30వ‌ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి డిసెంబరు 31వ‌ తేదీ ఉదయం 6 గంటల వరకు నిరంతరంగా పారాయణ – నృత్యం – వినోదం – సంగీతంతో అన్ని రంగాల్లో విజయవంతంగా కార్యక్రమం సాగింది.

డిసెంబరు 30వ‌ తేదీ సాయంత్రం 3 గంటలకు అన్నమయ్య సదనంలో సాయి సన్నిధి కూచిపూడి నృత్య అకాడమీ సుమారు 70 మంది శిష్యులచే 108 దివ్య సంకీర్తనల నృత్య ప్రదర్శన జరగింది. ఈ నృత్య కైంకర్యానికి గురువుగా వి. రాధిక శ్రీనివాస్ వ్యవహరించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అన్నమయ్య అష్టోత్తరం చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు స్వరపరచిన ప్రత్యేక కీర్తన వైకుంఠ వాసం భజే అందరికీ నేర్పారు. డిసెంబరు 31వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు పద్మశ్రీ డా. శోభారాజుతో కలిసి శ్రీ అన్నమాచార్య అనే చక్కని తెలుగు ధారావాహిక వీక్షణ, అనంతరం ఉదయం 6 గంటలకు అన్నమాచార్య భావనా వాహిని శిష్యులచే సంకీర్తనా గానం, మంగళహారతి నిర్వహించారు.

 

ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, చైర్మన్ పి. పి. రాజు, సంస్థ వ్యవస్థాపకురాలు శోభారాజు కార్యక్రమ నిర్వహణకు సహకరించిన సేవకులను, భక్తులను కొనియాడారు. భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే దృక్పథంతో దర్శన-పారాయణ-నృత్యం-సంగీతం-వినోదం-సంకీర్తనా గానంతో సాగిన ఈ వైకుంఠ వాసం భజే కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here