కూకట్‌పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జెఎన్టియు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ నిర్వహణ ఫీజు రద్దు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. లాక్ డౌన్లో మార్చి నెల తర్వాత నుండి ఇప్పటి వరకి తెరుచుకోని హాస్టల్ కి మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పి ఒక్కొక్క విద్యార్ధి నుండి నెలకు రూ.340 చొప్పున మొత్తం సుమారుగా రూ.4 వేలను వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ విధంగా 3 వేలకు పైగా ఉన్న విద్యార్థుల నుంచి రూ.1 కోటి 25 లక్షలకు పైగా వసూలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ టెక్నికల్ సెల్ కన్వీనర్ తోట శ్రీనివాస్, కూకట్‌పల్లి విభాగ్ కన్వీనర్ సంజన్న గారి విజయ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే వెనక్కి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సంబంధించిన నిర్వహణ ఫీజు ఏదైనా యూనివర్సిటీ భరించాలని అన్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్, రెక్టార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రామకృష్ణ, సాయి కుమార్, వర్షిత్, రిత్విక్ పాల్గొన్నారు.






