హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు షాకిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపు ముద్ర లేదా పెన్ను గీతలు ఉన్నా బ్యాలెట్ పేపర్లను లెక్కించాలని, ఆ ఓట్లు చెల్లుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్‌ను జారీ చేసిన విషయం విదితమే. అయితే దీనిపై బీజేపీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఇతర గుర్తులు, రాతలు ఉన్న పత్రాలను విడిగా లెక్కించాలని ఆదేశించింది.
కాగా హైకోర్టు తాను ఇచ్చిన ఆదేశాలపై అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు అన్ని వివరాలతో ఎలక్షన్ కమిషన్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఉత్తర్వులపై ఈసీ లంచ్ మోషన్ దాఖలు..
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునః పరిశీలించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ మేరకు ఈసీ హైకోర్టుకు విజ్ఞప్తి చేయనుంది.