- అందరూ అప్రమత్తంగా ఉండాలి
- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న 48 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు సుమారుగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, తెరాస డివిజన్ అధ్యక్షులు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల కమిటీ మెంబర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలోనూ లోతట్టు ప్రాంతాలలో ఉంటున్న ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గాంధీ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఫంక్షన్ హాళ్లలోకి తరలించాలని, అపార్ట్‌మెంట్ల పైన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేసే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అన్నారు. ముంపు ప్రాంతాలలోని ప్రజలకు ఉపశమనం కలిగేలా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఏదైనా అత్యవసరం అయితే తమను గానీ, తమ కార్యాలయ సిబ్బందిని గానీ, సంబంధిత అధికారులను గానీ సంప్రదించాలని సూచించారు.