శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి సమర్పించారు. అనంతరం శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, కార్యాలయ కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని ఆయన ప్రార్థించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.






