శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. సైబరాబాద్ ట్రాఫిక్ ADCP అడ్మిన్ జి. నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 292 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 240 మంది ద్విచక్ర వాహనదారులు, 12 మంది ఆటో డ్రైవర్లు, 40 మంది కార్ల డ్రైవర్లు ఉన్నారు. హెవీ వాహనదారులు ఎవరూ పట్టుబడలేదని పోలీసులు తెలిపారు.

బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (BAC) ఆధారంగా పరిశీలిస్తే.. 248 మందిలో 36–200 ఎంజీ/100 ఎంఎల్, 30 మందిలో 201–300 ఎంజీ/100 ఎంఎల్, 14 మందిలో 301–550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారందరినీ చట్టపరమైన చర్యల్లో భాగంగా కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు సైబరాబాద్ పరిధిలో 681 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీటిలో 18 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష, 7 మందికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్, మరో 656 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపకుండా వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.





