శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదివారం శంభీపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా SIR ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు. SIR ప్రక్రియలో ఓట్లు కోల్పోయిన వారికి అండగా నిలవాలని, నోటీసులు అందుకున్న వారికి సరైన అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. అవసరమైన గుర్తింపు పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించేలా ప్రజలకు సహకరించాలని, ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.

ఓటు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని నాయకులు పేర్కొన్నారు. SIR ప్రక్రియపై అవగాహన లేని ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించి, వారి ఓటు హక్కును పరిరక్షించేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.





