హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో ఎక్కడ సమస్య ఉన్నా తక్షణమే అధికారులతో కలిసి వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ గారు తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ లో ఆరెకపూడి గాంధీ శుక్రవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సన్నద్ధం కావాలని అన్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు కోనేరు కృష్ణ ప్రసాద్, రంగరాయ ప్రసాద్, కాలనీ వాసులు వెంకట్ రావు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.