నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బిజెపి సీనియర్ నాయకులు మువ్వా సత్యనారాయణ, డి ఎస్ ఆర్ కె ప్రసాద్, నాగేశ్వర్ గౌడ్, బిజెపి నాయకులు పాల్గొని రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జీవో 317ను రద్దు చేయాలని శాంతియుతంగా నిరసనలు చేసిన వారిని తప్పుబట్టడం అనైతికమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాలు, నిరంకుశ ధోరణికి బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. కోవిడ్ నిబంధనల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష పార్టీల పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని శాంతియుత దీక్షలు, నిరసనలను సైతం అడ్డుకోవడం కేసీఆర్ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా బదిలీలపై తెచ్చిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో కేటీఆర్ కరోనా నిబంధనలు పాటించకుండా పర్యటిస్తే పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను విడుదల చేసి కార్యకర్తలపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాణిక్ రావు, బాబు రెడ్డి, లక్ష్మణ్, రామకృష్ణ, విజేందర్ సింగ్, వెంకట్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.