నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కాలనీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. చందానగర్ మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షా కాలంలో వరద ముంపు ప్రాంతాలను గుర్తించి పనులను పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లు పనులను సకాలంలో పూర్తి చేయాలని, అలా పుర్తి చేయని కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు కార్పొరేటర్ మంజుల రెడ్డి సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను, కొత్తగా చేపట్టబోయే పనుల టెండర్ల పక్రియ ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయా కాలనీలలో కాలనీ వాసులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రధానంగా సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. సమావేశంలో మియాపుర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఈ శివరాం, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.