అన్నమయ్యపురంలో గతిస్త్వం కళా నృత్యార్చన

శేరిలింగంప‌ల్లి, మే 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమం ఈ వారం కూడా భక్తి పారవశ్యంతో సాగింది. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 150 మందికి పైగా భక్తులకు అన్నదాన ప్రసాదం అందజేశారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం హిందూపురానికి చెందిన గ‌తిస్త్వం సంస్కృతిక కళా నిలయం ఆధ్వర్యంలో గురువు ఎం. దుర్గ విద్యాధరి మార్గదర్శకత్వంలో శిష్యులు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. జె.వి. శ్రేయ, ఎన్. నిర్విష, కె.ఎన్. రేఖ, ఎం. దివిజ, వై. వర్ష, ఎం. శరయు, ఎం.ఎన్. బాలశ్రీ, పి. సమీక్ష, రిద్ధి సత్రసాల, టి. ధృతి, డి. జస్విత, సి. నాగ సౌగంధిని, ఎస్. ప్రియ లాస్య తదితరులు కలిసి గ‌ణపతి తాళం, నర్తన గణపతిం, జతి స్వరం, పలుకే బంగారమాయెనా, దశావతార శబ్దం, శుద్ధబ్రహ్మ, కొలువైతివా, భామాకలాపం, జై శ్రీరామ్, వేంకటాచల, ప్రహ్లాద, కృష్ణం కలయసఖి, తిల్లానా, గోవింద నామాలు వంటి నృత్యాంశాలను లయబద్ధంగా, భావాభినయ సమన్వయంతో ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

అన్నమయ్య భక్తి సాహిత్యం, పురాణ గాథలు, శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ ప్రదర్శనలు సభకు ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను తీసుకొచ్చాయి. కళాకారుల ప్రతిభకు భక్తులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ పాల్గొని కళాకారులందరికీ శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here