- భక్తులను విశేషంగా ఆకట్టుకున్న గరికపాటి ప్రవచనం
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠపాలిత షిరిడి సాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ షిర్డి సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాకడహారతి, పంచామృత ఫలాభిషేకం, అలంకరణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణ, మంటపారాధనలు, లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ, మన్యుసూక్త హోమాలు, సంద్యాహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్థానిక భక్తులు సాంబశివరావు హేమలత, సంజీవి, కల్యాణి దంపతుల ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సాయంత్రం ప్రముఖ సహస్ర అవధాని బ్రహ్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మార్చి 1 వరకు ఆలయ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతాయని, ఆదివారం 108 లీటర్ల పాలతో సాయిబాబాకు క్షీరాభిషేకం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా చండీ హోమం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ యూవి రమణమూర్తి తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.






