వంటగదిలోకి మురుగునీటి లీకేజీపై వివాదం.. మహిళపై దాడి ఆరోపణలు, కేసు నమోదు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇంటి పైభాగంలోని బాత్‌రూమ్ డ్రైనేజీ నుంచి మురుగునీరు వంటగదిలోకి లీక్ అవుతున్న విషయంపై తలెత్తిన వివాదం దాడికి దారితీసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు దుర్గం మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్తకు సోద‌రుడు అయిన శ్రీను తన కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదుదారి నివాసానికి సరిగ్గా పైభాగంలో ఉన్న ఇంటిలో నివసిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వారి బాత్‌రూమ్ డ్రైనేజీ నుంచి వచ్చే మురుగునీరు తన ఇంటి వంటగదిలోకి లీక్ అవుతోందని, ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా సమస్యను పరిష్కరించలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

అలాగే, తన ఇంటికి ఆనుకుని ఉన్న మెట్ల మార్గానికి వేసిన తాళాన్ని నిందితులు పగులగొట్టారని ఆరోపించింది. ఈ విషయమై ప్రశ్నించగా, తన భర్త సోద‌రుడి కుమారులు దుర్గం సతీష్, దుర్గం శ్రీహరి, వారి కుటుంబ సభ్యులతో కలిసి తనను అసభ్య పదజాలంతో దూషించి, చేతులతో కొట్టి రోడ్డుపైకి తోసేశారని ఆరోపించింది. ఈ ఘటనలో తన తలకు గాయమైందని తెలిపింది. తన తల్లిని రక్షించేందుకు మధ్యలోకి వచ్చిన కుమారుడు సాయి చరణ్‌పై కూడా నిందితులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 844/2026 కేసు నమోదు చేసి, బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 79, 115(2), 3(5) కింద దర్యాప్తు ప్రారంభించారు.

డ్రైనేజీ నీరు పోసి వేధింపులు.. ఇంటి గేటుకు తాళం వేసి అడ్డుకున్నారంటూ ముగ్గురిపై కేసు..

గత రెండు సంవత్సరాలుగా పొరుగింటి మహిళ, ఆమె కుటుంబ సభ్యుల నుంచి నిరంతర వేధింపులు ఎదుర్కొంటున్నామని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసు నమోదు అయింది. ఫిర్యాదుదారు దుర్గం లత తెలిపిన వివరాల ప్రకారం.. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి ఒకే భవనంలోని మొదటి అంతస్తులో నివసిస్తుండగా, గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే మౌనిక తరచూ అసభ్య పదజాలంతో దూషించడం, అనవసరంగా గొడవలు చేయడం, కుటుంబ సభ్యుల ప్రశాంతతకు భంగం కలిగించడం చేస్తున్నారని ఆరోపించింది. జూలై 30న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మౌనిక తన ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు డ్రైనేజీ నీటిని ఇంట్లోకి పోసి, తనపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

అలాగే ఆగస్టు 6న ఉదయం సుమారు 8 గంటలకు మౌనిక, శోభన్ అనే అద్దెదారుతో కలిసి తన ఇంటికి వెళ్లే మెట్ల గేటుకు అక్రమంగా తాళం వేసి రాకపోకలను అడ్డుకున్నారని తెలిపారు. మౌనిక కుమార్తె ప్రియాంక కూడా తనను దూషించడంతోపాటు గర్భవతిగా ఉన్న తన కుమార్తెపై దాడి చేయడానికి ప్రయత్నించిందని, మౌనిక కుమారుడు సాయి కూడా ఈ వేధింపుల్లో భాగస్వామిగా ఉన్నట్లు ఫిర్యాదుదారు ఆరోపించింది. పదేపదే దూషణలు, బెదిరింపులు, దాడికి ప్రయత్నాలు, ఇంటికి వెళ్లే మార్గాన్ని అడ్డుకోవడం వల్ల తాము తీవ్ర మానసిక ఒత్తిడి, భయాందోళనలకు గురవుతున్నామని పేర్కొంటూ మౌనిక, సాయి, ప్రియాంకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైం నం. 845/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 126(2), 79, 115(2)తో పాటు 3(5) కింద దర్యాప్తు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here