శేరిలింగంపల్లి, జూన్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): పరిగి మండలంలోని మాటుగూడెం గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ దేశాలను అధ్యయనం చేసి, రాజ్యాంగ కమిటీ సభ్యులతో కలిసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. గత 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా కొనసాగడం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు.

మాటుగూడెంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కావడం ఆనందదాయకమని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. దీనికి బీసీ సమాజం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. అంబేద్కర్ గురువైన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక మార్పు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందడం లేదని, పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ధనవంతులు మరింత సంపన్నులవుతుండగా పేదలు మరింత వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఐక్యంగా జేఏసీగా ఏర్పడి సమాన న్యాయం, సామాజిక సాధికారత కోసం పోరాడాలని బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికారం సాధన ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు, జాతీయ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పరి కృష్ణ, దేవినేనిగూడెం వెంకటయ్య, మహేందర్ యాదవ్, బహుజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





