- ఆత్మ గౌరవాన్ని కాపాడాలి
- సగర సంఘం రాష్ట్ర కమిటీ కార్యవర్గం తీర్మానం
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆత్మ గౌరవ భవనం నిర్మాణం కోసం సగర జాతికి ఇచ్చిన స్థలాన్ని మార్చకూడదని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కోకాపేటలో సగర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కులాలకు ఆత్మ గౌరవ భవనాల పేరుతో ఇచ్చిన స్థలాలను కొందరు అధికారులు కుట్రలు చేసి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కార్యవర్గం అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే మొదట కేటాయించిన ప్లాట్ నంబర్ 5 లో సగర ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని కార్యవర్గం సూచించింది. సంఘ పటిష్టతకు గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. నిర్మాణ రంగమే కుల వృత్తిగా బ్రతుకును కొనసాగిస్తున్న సగరులకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ కల్పించాలని కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో సంఘ గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల భిక్షపతి సగర, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్. బి. ఆంజనేయులు సగర, ప్రధాన కార్యదర్శి రాంసగర, రాష్ట్ర కార్యవర్గంతో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు.