సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం రాత్రి కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న 180 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్బంగా సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు.

మద్యం సేవించి వాహనం నడిపుతూ పట్టుబడితే మొదటి సారి రూ.10వేల ఫైన్ లేదా 6 నెలల జైలు శిక్ష, రెండో సారి రూ.15వేల పైన్ లేదా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడతాయన్నారు. ఆ తరువాత మళ్లీ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. అందువల్ల మద్యం సేవించి వాహనాలను నడపవద్దన్నారు. కొద్ది మోతాదులో సేవించినా వాహనం నడిపితే దాని వల్ల ప్రమాదాలు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, కనుక వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని అన్నారు.
కాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్‌లో 30, మియాపూర్‌లో 8, కూకట్‌పల్లిలో 28, బాలానగర్‌లో 10, జీడిమెట్లలో 111, ఆల్వాల్‌లో 10, రాజేంద్ర నగర్లో 18, శంషాబాద్‌లో 10, గచ్చిబౌలిలో 38, షాద్ నగర్లో 17 మొత్తం కలిపి 180 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 2 వీలర్లను నడిపిన వారు 126 మంది ఉండగా, 3 వీలర్ వాహనదారులు 5 మంది, 4 వీలర్ వారు 47, హెవీ వెహికల్ వాహనాలను నడిపిన వారు ఇద్దరు ఉన్నారు.





