శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా మహామ్మారిని సైతం లెక్కచేయకుండా ప్రజలకు విశేష సేవలు అందించిన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సేవలు అభినంనీయమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ ప్రసంశించారు. నగరంలో టీటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో భాగంగా కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ ధనలక్ష్మికి డిప్యూటీ సీఎం స్వయంగా టిటీవీ ఎక్స్ లెన్స్ అవార్డు – 2020 కరోనా వారియర్ అవార్డును అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహముద్ అలీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభించిన క్రమంలో తమ సేవా కార్యక్రమాలతో రాష్ట్రమంతటా పర్యటించి లక్షలాది మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం గొప్ప విషయమని కొనియాడారు. తమ ట్రస్ట్ సేవలకు గుర్తింపుగా ఎక్స్ లెన్స్ అవార్డు 2020 ని అందించిన టీటీవీ యాజమాన్యానికి గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ ధనలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డును అందుకుంటున్న గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ అధినేత గుడ్ల ధనలక్ష్మి