- మాదాపూర్ చందానాయక్ తండా నడిరోడ్డుపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన
నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వంలో మైహోమ్ లాంటి బడా నిర్మాణ సంస్థల వెంచర్లకు వెళ్లే రోడ్లను ఆగమేగాలపై అభివృద్ధి చేస్తూ నిరుపేదలు నడిచే మార్గాలపై సీతకన్ను వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్‌టీ సెల్ చైర్మన్, మాదాపూర్ డివిజన్ ఇంచార్జీ డి.సురేష్ నాయక్ మండిపడ్డారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని చందానాయక్ తండాకు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిని చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోకపోవడంపై విసుగు చెందిన స్థానికులతో కలసి ఆ నడి రోడ్డులోని బురదలో వరి నాట్లు వేశారు. అనంతరం చందానగర్ సర్కిల్ ఉపకమిషనర్ సుధాంష్ నందగిరిని కలసి వినతీ పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ సంకలు గుద్దుకునే టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నిరుపేదల నివాస ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ద్వజమెత్తారు. నగరం నలుమూలలా మైహోమ్ లాంటి పలు బడా వ్యాపార సంస్థల వెంచర్లకు అనుకూలంగా విశాల మైన రోడ్లు వేయిస్తున్న కేసీఆర్ హైటెక్ సిటీలోని నిరుపేదల నివసించే ప్రాంతానికి కనీసం నడుచుకుంటు కూడ వెళ్లలేని స్థితికి రోడ్లు చేరితే పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి చందానాయక్ తండా రహదారిని పునరుద్ధరించాలని, లేనిఎడల ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ డి.నాగేష్ నాయక్, నాయకులు ఆర్ సురేష్ నాయక్, నరేష్, లక్ష్మీ, పాండు నాయక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.