శేరిలింగంపల్లి జోన్‌లో కమిషనర్ సృజన సమీక్ష సమావేశం

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోన్‌లో సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కమిషనర్ జి. సృజన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలు, వివిధ విభాగాల పనితీరుకు సంబంధించిన నివేదికలను కమిషనర్‌కు వివరించారు. సమీక్ష సందర్భంగా కమిషనర్ సృజన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించి పెండింగ్ సమస్యలను గుర్తించి పరిష్కరించాల‌ని, సామాజిక మాధ్య‌మాల్లో అందే అన్ని పెండింగ్ ఫిర్యాదులు, వినతులను వెంటనే పరిష్కరించి ఫిర్యాదుదారులకు స్పష్టమైన సమాధానం అందించాల‌ని, రోడ్లపై గుంతలు, ప్యాచ్ వర్క్ పనులను ప్రాధాన్యత క్రమంలో తనిఖీ చేసి తక్షణ చర్యలు తీసుకోవాల‌ని అన్నారు.

రోడ్డు కోతలు చేసిన సంస్థలతో సమన్వయం చేసుకుని రోడ్డు పునరుద్ధరణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాల‌ని, అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే విధంగా క్రీడా మైదానాలను గుర్తించి అభివృద్ధి చేయాల‌ని, స్వీపింగ్ యంత్రాల వినియోగం, పారిశుద్ధ్య షెడ్యూల్ అమలును సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాల‌ని, వన్ వార్డ్ – వన్ డే కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లు, నాలా పనులు, ఇతర పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాల‌ని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. జోన్ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతోపాటు అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసే దిశగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సృజన అధికారులకు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here