నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమక్షంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, మైనింగ్ నిధులద్వారా దాదాపు 12 కోట్ల నిధులు మంజూరు చేయగా అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు జరగక పోవడంపై కలెక్టరు సంబంధిత శాఖల పనితీరుపై సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ స్థానిక అవసరాల దృష్ట్యా నిధులు మంజూరుచేసిన ప్రభుత్వ అధికారులు నిర్ణిత సమయంలో పనులు పూర్తి చేయక పోవడం బాధాకరమని కాంట్రాక్టర్లపై ఆధారపడి పనులు చేయకపోవడం సరైన విధానం కాదని అన్నారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, పాఠశాలలో అదనపు గదులకు మంజూరు చేసిన నిధులను ఉపయోగించి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

గృహ నిర్మాణ పధకంలో నమోదు చేసుకున్న లబ్ధిదారుల వాటా చెల్లించినా ఇప్పటికి కేటాయింపులు జరగకపోవడం బాధాకరమని, అక్రమ చొరబాటు దారులపై చెర్యలు తీసుకోని నిజమైన లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని అన్నారు. పత్రికానగర్ లో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలలో ఇంకా కొంతమందికి ఇండ్లు కేటాయించాల్సి ఉందని, ప్రస్తుతం తాత్కాలిక వసతిలో ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి భవనాలను నిర్మించాలని కలెక్టర్‌ని కోరారు. ప్రభుత్వ భూములలో కార్మిక భవనము, గ్రంధాలయము, బి సి హాస్టల్స్ (బాలుర ,బాలికల) వసతి నిర్మాణానికి స్థల కేటాయింపు, నిధుల మంజూరి ప్రతిపాదనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ ట్రస్టుకు స్థలం కేటాయింపు కొరకు దరఖాస్తును పరిశీలించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఓం ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ లక్ష్మి , గృహ నిర్మాణ పధకం ప్రోజెక్ట్ అధికారి రాజశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గృహ నిర్మాణ పధకం) కృష్ణయ్య , హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డీజీఎం అశోక్, ఇన్‌స్పెక్టర్ పోలీస్ శాఖ మధుసూదన్ రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.