శేరిలింగంపల్లిలో కొత్త హామీలకు ముందు పాత వాగ్దానాల అమలుపై సీఎం స్పష్టత ఇవ్వాలి: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హామీలు ప్రకటించే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. ఐటీ రంగ విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మిషన్ భగీరథ, నిరంతర విద్యుత్ సరఫరా వంటి కార్యక్రమాలతో శేరిలింగంపల్లి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలం గడిచినా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వాటి అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, తాగునీటి సరఫరా, రోడ్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయకుండా కొత్త శంకుస్థాపనలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని వ్యాఖ్యానించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి రాజకీయాలపై మాట్లాడే ముందు స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా అరికేపూడి గాంధీ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో, ఆయన రాజకీయ వైఖరి ఏమిటో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవకాశవాదం గురించి మాట్లాడే నాయకులు ముందుగా తమ వైఖరిని ప్రజల ముందుంచాలని సూచించారు.

శేరిలింగంపల్లి ప్రజలు రాజకీయ ప్రసంగాల కంటే అభివృద్ధి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్న రవీందర్ యాదవ్, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రధాన సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని కోరారు. శంకుస్థాపనల కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ముఖ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాల‌ని, శేరిలింగంపల్లి ప్రజలకు వాస్తవాలు చెప్పి, అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాల‌ని చిర్రా రవీందర్ యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here