కోహినూర్‌లో ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

శేరిలింగంప‌ల్లి, జూన్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య అవగాహన, ముందస్తు ఆరోగ్య పరీక్షలు కీలకమని మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. సిమ్స్ హాస్పిటల్, బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఆరో రియాల్టీ కోహినూర్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్, రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆరో కోహినూర్ ఫ్లాట్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సహకారంతో క్లబ్‌హౌస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 వైద్య విభాగాలకు చెందిన నిపుణులు సేవలందించారు. సుమారు వెయ్యికి పైగా కుటుంబాలకు చెందిన సభ్యులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి, సొసైటీ డైరెక్టర్లు నరసింహ, కిషోర్, కరుమూరి, విజయ్ మిశ్రా, అరుణ్ రెడ్డి, వర్మ, సత్యనారాయణ, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు కేవలం ఆరోగ్య పరీక్షలకు మాత్రమే పరిమితం కావని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది వేస్తాయని అన్నారు. ఒక సమాజ అభివృద్ధికి ఆరోగ్యం ప్రధాన ఆధారమని, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారని గుర్తు చేశారు. ఆరోగ్యం బాగుంటేనే సంపద, హోదా, విజయాలు, కుటుంబ సంతోషం వంటి వాటికి నిజమైన విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే ముందుగానే గుర్తించి నివారించడమే ఉత్తమ వైద్యమని అన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. నేటి జీవనశైలిలో అధిక ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ వినియోగం, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలామందికి తమకు వ్యాధి ఉన్న విషయం కూడా తెలియకపోవడం మరింత ఆందోళనకరమని పేర్కొన్నారు.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు మాట్లాడుతూ ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే మొత్తం కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ప్రభావితమవుతుందని తెలిపారు. కుటుంబ ఆరోగ్యంలో మహిళల పాత్ర కీలకమని, వృద్ధులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, యువత శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరోగ్యం వ్యక్తిగత అంశం మాత్రమే కాదని, కుటుంబం, కమ్యూనిటీ, సమాజం కలిసి మోసే బాధ్యత అని పేర్కొన్నారు. ఆరోగ్యంపై చేసే ఖర్చు వ్యయం కాదని, భవిష్యత్తుపై పెట్టుబడి అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కమ్యూనిటీ ప్రతినిధులు, నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here