శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస ఛార్జీని ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.10 పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దుర్మార్గమైన నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆయన విమర్శించారు. ప్రతి ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం మోపడం అన్యాయం అన్నారు. బడుగుజీవులు, దినసరి కూలీలు ఎలా బతకాలని ఆయన ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, టీ-24 టిక్కెట్ ఛార్జీలను పెంచింది చాలదన్నట్టు, ఇప్పుడు కనీస ఛార్జీపై కనికరం లేకుండా 50 శాతం ధరలను పెంచడం రేవంత్ రెడ్డి అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం అని రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మోసపూరిత విధానాలపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. రానున్న ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.






