సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె విరమించాలి: గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్

శేరిలింగంప‌ల్లి, మే 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక వర్గ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె, నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవరావు మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సెంట్రింగ్ రేట్లు పెంచాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు. నిర్మాణ రంగం ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు సమ్మెను విరమించాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె. రాజా రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ యుద్ధాల ప్రభావంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయని, దీనికి తోడు సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె కారణంగా చిన్న బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్వప్న శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచే ప్రయత్నాలు ఈ సమయంలో నిర్మాణ రంగానికి మరింత భారం అవుతాయని పేర్కొన్నారు. అలాగే ఎస్‌ఎఫ్‌టీ రేట్ల పెంపును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

జనరల్ సెక్రటరీ పి.బి.ఎస్. విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనంలో ఉందన్నారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తో ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరును ముడిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్లే, ప్రస్తుత ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల శాతాన్ని తగ్గించి వినియోగదారులకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి చేశారు. టెక్నికల్ అడ్వైజర్ సుమా రామకృష్ణ మాట్లాడుతూ బిల్డింగ్ పర్మిషన్ల సమయంలో వసూలు చేస్తున్న లేబర్ సెస్ నిధుల నుంచి సెంట్రింగ్ కాంట్రాక్టర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో పులి మురళి, ఉపేందర్ రెడ్డి, చక్రపాణి, వాసుదేవరావు, రామకృష్ణ, విజయ ప్రతాప్ రెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here