శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహించిన వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాల్లో కర్ణాటక సంగీత గానకచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మనోజ మాధురి నేతృత్వంలోని బృందం కర్ణాటక గాత్ర కచేరిని అందించింది. ఈ సందర్భంగా సిద్ధివినాయకం, గోపాల పాహిమాం, దేవర్ణమా, బృందావన తిల్లాన వంటి కీర్తనలను ఆలపించి సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. అనంతరం స్వాతి రెడ్డి ఆధ్వర్యంలోని శశిహాయ్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించింది. రాజేశ్వరి అష్టకం, హిందోళ తిల్లాన, శ్రీహరి స్తోత్రం, ధనుశ్రీ తిల్లాన, అన్నమాచార్య కీర్తన, గణేశ పంచరత్నం, పుష్పాంజలి, నటన మనోహర తదితర నృత్యాంశాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రదర్శనల్లో కళాకారులు నామాస్వి, లౌక్య, జాన్విక, హంవీక, వీణ, వైష్ణవి, శ్రీకరీ, గమన తదితరులు తమ ప్రతిభను చాటుతూ ప్రేక్షకులను మెప్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విక్రమ్ కుమార్, డాక్టర్ కళా కృష్ణ కళాకారులను అభినందించి, భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.






